🚔 టి-ఫైబర్ దొంగతనాల కేసులో అరెస్టైన నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల రూరల్ పోలీసులు.
🚔 టి-ఫైబర్ దొంగతనాల కేసులో అరెస్టైన నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడిస్తున్న జగిత్యాల రూరల్ పోలీసులు.
జగిత్యాల, జూన్ 5 | DNN News |
గ్రామపంచాయతీ భవనాల్లో ఏర్పాటు చేసిన టి-ఫైబర్ (T-Fiber) పరికరాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస దొంగతనాల కేసులను జగిత్యాల రూరల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.4.52 లక్షల విలువైన 39 బ్యాటరీలు, 4 యూపీఎస్ పరికరాలు, ఒక ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు.
గురువారం ఉదయం ధరూర్ గ్రామ శివారులోని జగిత్యాల బైపాస్ రోడ్డుపై అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు, అనుమానాస్పదంగా వెళ్తున్న TG21T1774 నంబర్ గల ఆటోను తనిఖీ చేశారు. ఆటోలో భారీ సంఖ్యలో బ్యాటరీలు, యూపీఎస్ పరికరాలు గుర్తించడంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో ప్రధాన నిందితుడు బండ అంజయ్య గతంలో టి-ఫైబర్‌కు అనుబంధ సంస్థ స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో డ్రైవర్‌గా, అనంతరం టెక్నీషియన్‌గా పనిచేసినట్లు వెల్లడైంది. ఉద్యోగం మానేసిన తరువాత గ్రామపంచాయతీ భవనాల్లోని టి-ఫైబర్ పరికరాలను దొంగిలించేందుకు పథకం రచించి తన సహచరులు మండలి రవి, చెమేల్ల నరేష్లతో కలిసి వరుస దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ధర్మారం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి, హన్మాజీపేట, అనంతారం, గుట్రాజ్‌పల్లి, అంతర్గాం, గొల్లపల్లి తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన టి-ఫైబర్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన సొత్తును విక్రయించేందుకు తరలిస్తున్న సమయంలో వారిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు.
• బండ అంజయ్య (36), లక్ష్మీపూర్
• మండలి రవి (49), లక్ష్మీపూర్
• చెమేల్ల నరేష్ (38), లక్ష్మీపూర్

• HBL OPTIMUZ SMF VRLA 12V 95Ah బ్యాటరీలు – 14
• EXIDE POWER SAFE PLUS 12V 65Ah బ్యాటరీలు – 21
• EXIDE POWER SAFE PLUS 12V 42Ah బ్యాటరీ – 1
• TUNWAL E-VEHICLE 12V 32Ah బ్యాటరీలు – 3
• UPS పవర్ సప్లయర్లు – 4
• బజాజ్ ప్యాసింజర్ ఆటో (TG21T1774)
నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
🖋️ రిపోర్టర్: మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
📰 DNN NEWS ప్రతినిధి
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
