షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన నిరుపేద కుటుంబ ఇల్లు
రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం.. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి
📍 జగిత్యాల జిల్లా | జూన్ 13, 2026 | శనివారం | DNN NEWS
జగిత్యాల పట్టణంలోని స్థానిక మోచి బజార్ 40వ వార్డులో నివాసం ఉంటున్న రాచర్ల గంగాధర్‌కు చెందిన పెంకుటి ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న కుట్టు మిషన్లు, గృహోపకరణాలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కుట్టు మిషన్ల ద్వారానే కుటుంబ జీవనం సాగుతుండగా, ఒక్కసారిగా జీవనాధారం కోల్పోయామని గంగాధర్ కన్నీటి పర్యంతమయ్యారు.

అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. లేకపోతే మరింత భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.
ఈ ఘటనతో మరో సమస్య వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాదం జరిగిన వీధిలో ఫైర్ ఇంజన్ వెళ్లేందుకు కూడా సరిపడా రోడ్డు వెడల్పు లేకపోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలకు ఇలాంటి ఇరుకైన వీధులు తీవ్ర ఆటంకంగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు.

బాధిత కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినదని, ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగిన ఆర్థిక సహాయం అందించాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. మానవతా దృక్పథంతో ప్రత్యేక సహాయక ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ సురేష్ సుంచు
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
