కోరుట్ల, జూలై 15 (DNN న్యూస్): కోరుట్ల పురపాలక సంఘం కార్యాలయంలో మంగళవారం ‘నమస్తే డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యం, గౌరవాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పారిశుధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) కిట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తిరుమల వసంత, వైస్ చైర్పర్సన్ మహమ్మద్ షాహెద్ ఉల్ అహద్, మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర, స్థానిక వార్డు ప్రజాప్రతినిధులు హాజరై కార్మికులకు స్వయంగా రక్షణ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత మాట్లాడుతూ, స్వచ్ఛ కోరుట్ల నిర్మాణంలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని అన్నారు. వారికి సమాజంలో తగిన గౌరవం, సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే ‘నమస్తే డే’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు రక్షణ పరికరాలను విధిగా ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
✍️ రిపోర్టర్: జమీల్
📍 కోరుట్ల | DNN న్యూస్
