ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ అత్యంత కీలకం: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు
గుంటూరులో సీపీఐ మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతులకు శ్రీకారం
గుంటూరు, జూలై 15 (DNN న్యూస్): ప్రజాస్వామ్యంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో రాజకీయ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, అది బలహీనపడితే మిగిలిన వ్యవస్థల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.
సీపీఐ గుంటూరు జిల్లా సమితి సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యుల కోసం ఏర్పాటు చేసిన మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతులను బుధవారం గుంటూరులోని మల్లయ్య లింగం భవన్లోని వి.ఎస్.కే హాల్లో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని అన్నారు. అధికార పార్టీ అన్ని వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత కలిగి ఉండగా, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ లోపాలను నిర్మాణాత్మకంగా ప్రజల ముందుకు తీసుకురావాలని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని అమలు చేసే నాయకుల వ్యక్తిత్వంపైనే రాజ్యాంగ విలువలు ఆధారపడి ఉంటాయని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అందువల్ల ప్రజలు పాలకులను ఎన్నుకునే సమయంలో వారి సిద్ధాంతాలు, పనితీరును లోతుగా విశ్లేషించాలని సూచించారు.

ప్రస్తుతం రాజకీయ విలువలు క్షీణిస్తున్నాయని, ప్రజల హక్కులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, కార్మిక–కర్షక నేతృత్వంలో సమగ్ర సామాజిక మార్పు కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం “మార్క్సిజం అంటే ఏమిటి?” అనే అంశంపై బి. రామయ్య శిక్షణ ఇచ్చారు. మార్క్సిస్టు తత్వశాస్త్రం, భావవాదం–భౌతికవాదం మధ్య ఉన్న తేడాలను ఉదాహరణలతో వివరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, ప్రజానాట్యమండలి కళాకారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
✍️ రిపోర్టర్: కిరణ్ కుమార్
| DNN తెలుగు డిజిటల్ న్యూస్ |📍 గుంటూరు
