నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్
26 జిల్లాల నుంచి 264 మంది క్రీడాకారుల హోరాహోరీ పోటీ, విజేతలకు జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం.
నంద్యాల, జూలై 19 (DNN న్యూస్):
ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఆధ్వర్యంలో, నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన 264 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, వారిలో 124 మంది ఫిడే రేటింగ్ కలిగిన క్రీడాకారులు ఉన్నారు.

జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవానికి రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా, జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడు సుధాకర్, రామకృష్ణ విద్యాసంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని, చెస్ ఏకాగ్రతను పెంపొందించే అత్యుత్తమ క్రీడ అని అన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో చెస్ విద్యార్థులలో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనా శక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో చెస్ క్రీడ అభివృద్ధికి జిల్లా చెస్ సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని, ఓటమిని అధిగమిస్తూ నిరంతర సాధనతో విజయాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు. హేమంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ విజేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున జాతీయస్థాయి చెస్ పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు.
టోర్నమెంట్ నిర్వాహకులు రామసుబ్బారెడ్డి, చీఫ్ ఆర్బిటర్ వెంకట కుమార్ మాట్లాడుతూ ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.
ప్రారంభోత్సవంలో డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి రిబ్బన్ కత్తిరించి పోటీలను ప్రారంభించగా, డాక్టర్ రవి కృష్ణ, హేమంత్ రెడ్డి చెస్ బోర్డుపై తొలి ఎత్తులు వేస్తూ టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ప్రతినిధులు, జిల్లా చెస్ సంఘం సభ్యులు, ఆర్బిటర్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
✍️ రిపోర్టర్: Kiran Kumar Paluri
📍 నంద్యాల|DNN న్యూస్
