పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని ఓ గది తాళాన్ని పగులగొట్టి, విద్యార్థులు ఉపయోగించే టేబుళ్లు, ఫ్యాన్లను ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.
పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొప్పారపు సత్యవతి, నాయకులు ఎనగందుల నారాయణ, ప్రకాష్‌గౌడ్, పట్టణ అధ్యక్షుడు మనోజ్, కాశివేణి ప్రణయ్, ఆసం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
