నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
విద్యార్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : అదనపు కలెక్టర్ బి.ఎస్. లత
📍 జగిత్యాల జిల్లా | జూన్ 17, 2026 | బుధవారం | DNN NEWS
దేశవ్యాప్తంగా ఈ నెల జూన్ 21న నిర్వహించనున్న NEET Re-Exam కోసం జగిత్యాల జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత తెలిపారు.
ఈ పరీక్ష జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబడనుండగా, మొత్తం 807 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలుగా ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ధర్మపురి రోడ్ మరియు జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నాచుపల్లి – కొండగట్టు ప్రాంతంలోని రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
బుధవారం జిల్లా యంత్రాంగంతో నిర్వహించిన సమావేశంలో పరీక్ష నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, భద్రతా చర్యలు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ, నీట్ రీ-ఎగ్జామ్‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు ముఖ్య సూచనలు
🔹 పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుండి 5:15 గంటల వరకు ఉంటుంది.
🔹 దివ్యాంగ అభ్యర్థులకు 2:00 గంటల నుండి 6:20 గంటల వరకు అదనపు సమయం కల్పిస్తారు.
🔹 కొత్తగా జారీ చేసిన అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి. పాత అడ్మిట్ కార్డు చెల్లదు.
🔹 అడ్మిట్ కార్డులో పేర్కొన్న పరీక్షా కేంద్రానికే హాజరు కావాలి.
🔹 పరీక్షా కేంద్రంలోకి ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది.
🔹 1:30 గంటల తర్వాత ప్రధాన గేటు మూసివేయబడుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.
🔹 అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ID Proof) తీసుకురావాలి.
🔹 అడ్మిట్ కార్డుకు జతచేసిన పోస్ట్‌కార్డ్ సైజు ఫోటోను అతికించి తీసుకురావాలి.
🔹 అదనంగా రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంట ఉంచుకోవాలి.
🔹 పారదర్శక (Transparent) వాటర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు.
🔹 పరీక్షా కేంద్రంలో ఇచ్చే పెన్‌తోనే పరీక్ష రాయాలి.
🔹 ప్రతి అభ్యర్థి రెండు అడ్మిట్ కార్డులు తీసుకురావాలి. ఒకటి పరీక్ష అనంతరం కేంద్రంలో సమర్పించాలి.
🔹 మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ సూచనలను గమనించి పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అదనపు కలెక్టర్ బి.ఎస్. లత సూచించారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
