గుంటూరులో మీడియా సమావేశంలో ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకుడు జంగాల అజయ్ కుమార్.
గుంటూరులో మీడియా సమావేశంలో ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకుడు జంగాల అజయ్ కుమార్.
గుంటూరు, |జూన్ 7 Sun|DNN న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఆదివారం గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో రాష్ట్రాన్ని శ్రీలంకతో పోలుస్తూ విమర్శలు చేసిన వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించకుండా ప్రజలపై అదనపు భారాలు మోపుతోందని విమర్శించారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా నిరంతరం పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజల జీవనం మరింత కష్టతరమైందన్నారు.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ హక్కుల కోసం ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల శ్రేణులు, కార్మికులు, రైతులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచారు
🖋️ రిపోర్టర్: DNN న్యూస్ రిపోర్టర్
📍 గుంటూరు, గుంటూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
