గడీ బురుజు స్థలాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దు ప్రజా ఆస్తిని ప్రజా ఆస్తిగానే పరిరక్షించాలి: అఖిలపక్ష, ప్రజా సంఘాల డిమాండ్
కోరుట్ల సబ్-రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పణ
📍 కోరుట్ల | జూన్ 09, 2026 | మంగళవారం | DNN NEWS
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడీ బురుజు స్థలాల విషయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని, ప్రజా ఆస్తిని ప్రజా ఆస్తిగానే పరిరక్షించాలని కోరుతూ అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు కోరుట్ల సబ్-రిజిస్ట్రార్‌కు వినతిపత్రం సమర్పించారు.
అఖిలపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు డాక్టర్ పేట భాస్కర్, ఎం.డి. ముజాహిద్ ఆధ్వర్యంలో సబ్-రిజిస్ట్రార్ డి. అశోక్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడీ బురుజు ఆస్తి చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రజా సంపదగా గుర్తింపు పొందిందని, ఇది ప్రజల ఆస్తిగా భావించబడుతోందని తెలిపారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు, ఆధారాలతో ఈ భూమిని అక్రమంగా తమ పేర్లపై నమోదు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఈ అంశంపై అఖిలపక్ష ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు సుమారు 30 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన వినతిపత్రాలను అధికారులకు సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇటీవల గడీ బురుజు స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం రావడంతో ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఏ ఆధారాలపై అనుమతులు ఇచ్చారు? సమర్పించిన పత్రాలు నిజమైనవా? నకిలీవా? అనే విషయాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు, యాజమాన్య పత్రాలు, లీగల్ హెయిర్ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ నంబర్లు, సర్వే నంబర్లు, హద్దులు, ఎన్‌కంబ్రెన్స్ రికార్డులు, ఇండెక్స్ వివరాలు తదితర సమాచారాన్ని పూర్తిగా బహిర్గతం చేయాలని కోరారు.
గడీ బురుజు ఆస్తి విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చింత భూమేశ్వర్, శనిగారపు రాజేష్, శంకర్ తదితర అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS ప్రతినిధి జమీల్
📍 కోరుట్ల
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
