వర్షాకాల వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి
లోతట్టు ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
📍 జగిత్యాల | జూన్ 09, 2026 | మంగళవారం | DNN NEWS
వర్షాకాలం నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు.
వర్షాకాలంలో నీటి నిల్వల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయిల్ బాల్స్, ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు.
భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
పునరావాస కేంద్రాలుగా ఫంక్షన్ హాల్స్, పాఠశాల భవనాలు మరియు ఇతర సౌకర్యవంతమైన ప్రదేశాలను గుర్తించి, అక్కడ అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు.
వర్షాకాలంలో నదులు, కాలువలు, చెరువులు, కుంటల సమీప ప్రాంతాల్లో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాటించాలి
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
