నందలూరు: అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని మగ్దూం బాబా దర్గాలో గురువారం సాయంత్రం ఉత్సాహభరిత వాతావరణంలో ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే ఈ ఉరుసు హిందూ, ముస్లింల ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. దర్గాలో నిర్వహించిన గంధం మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు పూల చాందర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పీఠాధిపతి మైనుద్దీన్ హుసేని ఎమ్మెల్యే, ఎంపీపీ లకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి మాట్లాడుతూ, “మగ్దూం బాబా వంటి మహానుభావులు అన్ని మతాల మధ్య ప్రేమ, సామరస్య సందేశాన్ని అందించారు. ఇలాంటి ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే కాకుండా, సమాజంలో స్నేహభావాన్ని బలపరుస్తాయి” అని అన్నారు. ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, “దర్గాలో జరిగే ప్రతి ఉత్సవం మన ప్రాంతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. ప్రజలు మతభేదాలు మరిచి సోదరభావంతో పాల్గొనడం హర్షణీయం” అని తెలిపారు.
కార్యక్రమంలో చిన్న పీఠాధిపతులు అఖిల్ సాహెబ్, హైదర్ హుసేని, మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి, మహిళా మండలి అధ్యక్షురాలు పల్లె మాధవి, వైయస్ఆర్సీపీ నాయకులు గొబ్బిళ్ల త్రినాధ్, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, గుండు మల్లికార్జున రెడ్డి, కరిముల్లా ఖాన్, నడివీధి సుధాకర్, అనుదీప్ జయసింహ, గుణ యాదవ్, ఇబ్బు, సోమిశెట్టి ప్రభాకర్, నాగసుబ్బయ్య, అజీజ్, కాకి చంద్ర, భాస్కర్ యాదవ్, అరిగే నాని తదితరులు పాల్గొన్నారు.
మగ్దూం బాబా ఉరుసు సందర్భంగా దర్గా పరిసరాలు దీపాలతో, పూలతో అలంకరించబడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరై భక్తి, ఐకమత్యంతో వేడుకను విజయవంతం చేశారు.
– అరవింద్ వలిమి
