DNN NEWS – ప్రత్యేక కథనం
ఉపాధి హామీలో దొంగ మాస్టర్ల దందా..! పోలాసిగూడెంలో కోట్ల నిధుల గోల్మాల్పై గ్రామస్థుల ఆగ్రహం
జంగారెడ్డిగూడెం న్యూస్ డెస్క్: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం పోలాసిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం అడ్డగోలు దోపిడీకి అడ్డాగా మారిందని గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పనులు చేయకుండానే దొంగ మాస్టర్లు వేసి, ప్రభుత్వ నిధులను కొందరు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు కుమ్మక్కై పక్కదారి పట్టిస్తున్నారని DNN News కు ఫిర్యాదు అందింది.
గ్రామస్థులు చెబుతున్న వాస్తవాలు:
గత ఎనిమిది నెలల్లో గ్రామంలో చెరువు పూడికతీత, పంట కాలువల శుభ్రత, స్మశాన వాటిక అభివృద్ధి పేరుతో సుమారు 12 పనులు కాగితాలపైనే పూర్తయినట్లు చూపించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని రైతులు వాపోతున్నారు.
హాజరు పట్టికల్లో పట్టణాలకు వలస వెళ్లిన కూలీలు, 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, పేర్లు సైతం ఉన్నాయని గ్రామస్థులు ఆధారాలతో చూపిస్తున్నారు.
NMMS యాప్లో ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉండగా, ఒకే చోట నిలబడిన నలుగురి ఫోటోలను వేర్వేరు తేదీల్లో అప్లోడ్ చేస్తున్నారని, రాత్రి 9 గంటల తర్వాత మాస్టర్లు ఆన్లైన్ చేస్తున్న దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని కూలీలు చెబుతున్నారు.
నిజంగా ఎండలో చెమటోడ్చి పనిచేసిన వారికి మాత్రం పూర్తి కూలీ అందడం లేదు. రోజుకు రూ. 289 రావాల్సి ఉండగా, చేతికి రూ.150 నుంచి రూ.180 మాత్రమే ఇచ్చి, మిగతాది కమీషన్ పేరుతో మినహాయిస్తున్నారని మహిళా కూలీలు కన్నీటి పర్యంతమయ్యారు.
అధికారుల పాత్రపై అనుమానాలు
ఈ మొత్తం తతంగం వెనుక ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ మరియు పంచాయతీ స్థాయి ఒకరిద్దరు సిబ్బంది హస్తం ఉందని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. సోషల్ ఆడిట్ గత రెండేళ్లుగా జరగలేదని, అడిగితే బెదిరింపులకు గురిచేస్తున్నారని దళిత కాలనీ వాసులు వాపోయారు.
గ్రామానికి చెందిన పలువురు యువకులు ఇప్పటికే MPDO, APO లకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని, అందుకే DNN News ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు.
“మేము పని చేస్తేనే పూట గడుస్తుంది. మా పేరుతో వేరే వాళ్ళు లక్షలు మింగేస్తుంటే చూస్తూ ఊరుకోలేం. కలెక్టర్ గారు ప్రత్యేక బృందంతో విచారణ చేయించి, దొంగ మాస్టర్లు వేసిన ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి,” అని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలాసిగూడెం ప్రజలు కోరుతున్నారు.
DNN News, జంగారెడ్డిగూడెం
