2వ Asian చెస్ ఫర్ ఫ్రీడమ్ ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్ – 2026లో ఇండియా-3 (యూత్ ఏలూరు) జట్టు ఘన విజయం
DNN ప్రపంచ వార్తా విభాగం – ఏలూరు
తేదీ: 21-05-2026
ఏలూరు గవర్నమెంట్ బాయ్స్ హోమ్ టోర్నమెంట్ హాల్లో నిర్వహించిన 2వ ఆసియన్ చెస్ ఫర్ ఫ్రీడమ్ ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్ – ప్రిజన్ టోర్నమెంట్ 2026లో భారత యువజట్టు ఇండియా యూత్-3 జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 12 పాయింట్లు సాధించి జట్టు ఛాంపియన్గా నిలిచింది. యూరోపియన్ దేశాలతో పాటు ఆసియా ఖండంలోని పలు దేశాలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక చెస్ ఛాంపియన్షిప్లో మొత్తం 22 దేశాలు ప్రాతినిధ్యం వహించాయి. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో భారత యువజట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతగా నిలవడం దేశానికి గర్వకారణంగా నిలిచింది.
అక్టోబర్ నెలలో జరగనున్న ఆన్లైన్ వరల్డ్ కప్ చెస్ ఛాంపియన్షిప్ – 2026లో ఏలూరు ప్రభుత్వ బాలుర గృహం నుండి ఎంపికైన ఈ నలుగురు బాలురు ఇండియా-3 (యూత్ ఏలూరు) జట్టు తరపున భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ స్థాయి చెస్ పోటీలకు వీరికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పాన్సర్షిప్ అందించనుంది.
ఇండియా యూత్-3 జట్టు ప్రదర్శన:
1వ రౌండ్: ఇండియా-1 (యూత్ ఏలూరు) – 2 పాయింట్లు, ఇండియా-3 (యూత్) – 2 పాయింట్లు
2వ రౌండ్: ఇండియా-3 (యూత్ ఏలూరు) – 4 పాయింట్లు, ఫిలిప్పీన్స్ – 0 పాయింట్లు
3వ రౌండ్: ఇండియా-2 – 2 పాయింట్లు, ఇండియా-3 (యూత్ ఏలూరు) – 2 పాయింట్లు
4వ రౌండ్: ఇండియా-3 (యూత్ ఏలూరు) – 4 పాయింట్లు, మంగోలియా-1 – 0 పాయింట్లు
5వ రౌండ్: ఇండియా-3 (యూత్ ఏలూరు) – 4 పాయింట్లు, కిర్గిజిస్తాన్ – 0 పాయింట్లు
6వ రౌండ్: ఇండియా-1 – 1 పాయింట్, ఇండియా-3 (యూత్ ఏలూరు) – 3 పాయింట్లు
7వ రౌండ్: ఇండియా-3 (యూత్ ఏలూరు) – 3 పాయింట్లు, మంగోలియా-2 – 1 పాయింట్
ఈ సందర్భంగా ఏలూరు హోమ్ హాల్ టోర్నమెంట్ అర్బిటర్ శ్రీ కిరణ్ కుమార్ పాలూరి మాట్లాడుతూ,
“చెస్ క్రీడ మానసిక వికాసానికి, ఆత్మవిశ్వాస పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఖైదీల పునరావాసంలో కూడా చెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆసియా స్థాయిలో భారత యువజట్టు విజయం సాధించడం గర్వకారణం” అని తెలిపారు.
పోటీలను పరిశీలకుడిగా వీక్షించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ వి. శ్రీనివాస్, విజయవాడ మాట్లాడుతూ,
“చెస్ క్రీడ క్రమశిక్షణ, సహనం, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి పోటీలు యువతకు మంచి ప్రేరణగా నిలుస్తాయి” అని పేర్కొన్నారు.
ఏలూరు బాయ్స్ హోమ్ చీఫ్ కోచ్ శ్రీ దేవరపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ,
“యువతలో చెస్ పట్ల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. భారత జట్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఆనందదాయకం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.
హోమ్ సూపరింటెండెంట్ శ్రీమతి పి. శ్రీవల్లి మాట్లాడుతూ,
“చెస్ పోటీలు పాల్గొనే వారిలో మానసిక స్థైర్యం, సమయపాలన, క్రమశిక్షణ వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జె. రాంబాబు, ఎ.వి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.
