సాంస్కృతిక విప్లవానికి కళాకారులు నడుం కట్టాలి – IPTA జాతీయ కార్యదర్శి గని
గుంటూరు కొత్తపేటలోని మల్లయ్య–లింగం భవన్ వద్ద IPTA 83వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గుంటూరు నగర కార్యదర్శి చెవుల పున్నయ్య అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న IPTA జాతీయ కార్యదర్శి గని IPTA జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. 1943లో భారత సాంస్కృతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు IPTA పునాది వేసిందని ఆయన తెలిపారు. ప్రజానాట్యమండలి అనేది కేవలం కళాకారుల వేదిక మాత్రమే కాదని, అది ఒక సాంస్కృతిక ఉద్యమమని ఆయన అన్నారు.
“స్వాతంత్ర్యం మా జన్మహక్కు” అనే నినాదంతో అప్పటి కాలంలో ప్రజలు గర్జిస్తున్న రోజుల్లో తన గళాన్ని కలిపి అనేక పాటలు ఆటలతో స్వాతంత్ర ఉద్యమానికి తోడ్పాటు ఇచ్చింది అని గని అన్నారు. కళను ప్రజల కోసం, ప్రగతి కోసం ఉపయోగించాలనే లక్ష్యంతోనే ఈ ఉద్యమం ముందుకు సాగిందన్నారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో కళాకారులు మరింత బాధ్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని, పాలకవర్గాల నియంతృత్వ ధోరణులు, రాజ్యాంగం స్థానంలో మనువాదాన్ని, సమైక్యత స్థానంలో విభజనకు ప్రోత్సహిస్తున్నాయని, కళాకారుల స్వేచ్ఛను అణచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, నగర కార్యవర్గ సభ్యులు నూతలపాటి చిన్న, జంగాల చైతన్య, బి. వెంకటేశ్వర్ రెడ్డి, పరిమళ బన్నీ, నగర సమితి సభ్యులు రాగం చంద్రమౌళి, డేవిడ్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
