వేలేరుపాడు అగ్నిప్రమాదం విషాదం
ఇద్దరు మహిళల మృతిపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ దిగ్భ్రాంతి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
DNN న్యూస్ | ఏలూరు | జూన్ 02, 2026
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో వలగాని సావిత్రి, సిగ పూలమ్మ అనే ఇద్దరు మహిళలు సజీవ దహనమై మృతి చెందడం అత్యంత బాధాకరమని ఎంపీ పేర్కొన్నారు.

మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
అగ్నిప్రమాదంలో వలగాని సావిత్రి నివాసంతో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు పూర్తిగా దగ్ధమవడం దురదృష్టకరమని ఎంపీ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ప్రమాద స్థలానికి వెళ్లిన కుక్కునూరు సీఐ రమేష్‌తో ఫోన్లో మాట్లాడారు.

ఈ అగ్నిప్రమాద ఘటనపై కొంతమంది స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తూ తనకు ఫోన్ చేసిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించినట్లు ఎంపీ తెలిపారు. ఇప్పటికే క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపుతున్నామని, ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉన్నట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంపీకి వివరించినట్లు సమాచారం.
ఈ విషాద ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండగా, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
