కుటుంబ కలహాలు, అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్యపై ఉన్న అనుమానంతో కన్న తండ్రే కాలయముడిగా మారి, 11 ఏళ్ల కుమారుడిని చిత్రహింసలు పెట్టి అంతమొందించిన అమానుష ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో కలకలం రేపింది.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాయుడుగూడెం గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తికి తన భార్య ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం నెలకొంది. ఈ క్రమంలో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి.
ఆ కోపం కాస్తా తన 11 ఏళ్ల కుమారుడు రిషిపైకి మళ్లింది. అత్యంత క్రూరంగా ప్రవర్తించిన వినోద్, కుమారుడు రిషిని ఇనుప గొలుసులతో కట్టివేసి తీవ్రంగా హింసించాడు. ఆ చిత్రహింసలను తట్టుకోలేక బాలుడు రిషి ప్రాణాలు వదిలాడు.
అల్లారుముద్దుగా పెరగాల్సిన పసివాడు తండ్రి చేతిలోనే బలికావడం చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పెదపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినోద్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
తండ్రి స్థానంలో ఉండి కొడుకును రక్షించాల్సింది పోయి, గొలుసులతో కట్టి చంపడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని, బాలుడికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
