ప్రజాస్వామ్యంపై దాడికి నిదర్శనం ఐఏఎస్ అధికారిపై దాడి – ఆకీటి అరుణ్ కుమార్ ఆగ్రహం
గుంటూరు సిపిఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వయానా ఒక ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన అధికారిపై దాడి జరగడం ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని వారు ప్రశ్నించారు. టిడిపికి చెందిన యువ కాంట్రాక్టర్ రాయపాటి అమృత రావు తన అనుచర గణంతో కలిసి గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్లోకి వెళ్లి కమిషనర్ మయూర్ అశోక్ పై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని కూటమి నాయకులు చెబుతున్నప్పటికీ, మరోవైపు ఉన్నతాధికారులపైనే దాడులు జరగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఒక ఐఏఎస్ అధికారికే రక్షణ కల్పించలేని ప్రభుత్వం సామాన్య ప్రజల భద్రతను ఎలా కాపాడగలదని నిలదీశారు. అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిడులు, బెదిరింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, అధికారుల స్వేచ్ఛాయుత విధుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తాయని అన్నారు. రాజకీయ జోక్యాలకు తావు లేకుండా ఘటనపై సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆకీటి అరుణ్ కుమార్ సిపిఐ కార్యదర్శి గుంటూరు నగర సమితి డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ గుంటూరు నగర కమిటీ సభ్యులు మంగ శ్రీనివాసరావు, సమితి సభ్యులు SK బాబర్ పాల్గొన్నారు.
