ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు సిపిఐ పోరాటం ఆగదు జూన్ 22న మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ధర్నా
DNN న్యూస్ గుంటూరు, జూన్ 1: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అశోక్‌నగర్ శాఖ సమావేశం 34వ డివిజన్ శాఖ కార్యదర్శి ఆర్కిటి రామచంద్రుడు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కోట మాల్యాద్రి మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగరంలో వేలాది మంది పేదలకు భూపోరాటాల ద్వారా భూములను సాధించి పంచిపెట్టిందన్నారు. అయినప్పటికీ నేటికీ గుంటూరు జిల్లాలో వేలాది మంది అర్హులైన నిరుపేదలు సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు పొందేంతవరకు సిపిఐ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో నగరంలోని అన్ని డివిజన్లలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు రాయిస్తున్నామని, ఈ డిమాండ్ సాధన కోసం జూన్ 22న గుంటూరు మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు, బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి సభ మరియు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జూన్ 6న ఉదయం 10 గంటలకు గుంటూరు కృష్ణానగర్ మెయిన్ రోడ్డులోని చండ్ర రాజేశ్వరరావు పార్కులో ఘనంగా నిర్వహించబడుతుందని తెలిపారు.
సిపిఐ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మహానేతకు నివాళులర్పించి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సిపిఐ గుంటూరు నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న మాట్లాడుతూ, జూన్ 25న మల్లయ్యలింగం భవన్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య గుంటూరు నగర మహాసభలకు ఈ శాఖ నుండి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో శాఖ సభ్యులు శ్రీనివాసు, అనిల్ కుమార్, ఓలేటి సుశీల, గోపాలకృష్ణ, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆకిటి అరుణ్ కుమార్ సిపిఐ కార్యదర్శి, గుంటూరు నగర సమితి విజ్ఞప్తి చేశారు
