ప్రెస్ నోట్ – “పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే… ప్లాస్టిక్ లంచ్ బాక్సులకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది!”

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కూల్‌కు తీసుకెళ్లే లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ప్లాస్టిక్ లంచ్ బాక్సుల్లో వేడి ఆహారం ఉంచినప్పుడు వాటిలో ఉండే హానికర రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా BPA, థాలెట్స్ వంటి కెమికల్స్ పిల్లల శరీరంలో చేరి హార్మోన్ల అసమతుల్యత, అలసట, జీర్ణ సమస్యలు మరియు భవిష్యత్తులో సంతాన సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఈ సమస్యలు వెంటనే కనిపించకపోయినా, దీర్ఘకాలంలో పిల్లల ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీసే “నిశ్శబ్ద శత్రువులుగా” మారతాయని అంటున్నారు.
అందువల్ల ప్లాస్టిక్ బాక్సుల స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్సులు, గ్రేడ్-304 స్టీల్ వాటర్ బాటిళ్లు లేదా రాగి పాత్రలను ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు. పిల్లలు జాగ్రత్తగా వాడగలిగితే గ్లాస్ కంటైనర్లను కూడా ఉపయోగించవచ్చని తెలిపారు.
అలాగే పిల్లల ఆరోగ్యం కోసం ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని ఇవ్వడం, రాత్రి త్వరగా తేలికపాటి భోజనం చేయించడం, ఉదయాన్నే నానబెట్టిన బాదంపప్పులు, తేనె ఇవ్వడం వంటి అలవాట్లు మంచివని చెబుతున్నారు. వారానికి కనీసం మూడు రోజులైనా ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారం అందించాలని సూచిస్తున్నారు.
ఆహారం ప్యాక్ చేయడానికి ప్లాస్టిక్ కవర్లు, అల్యూమినియం ఫాయిల్స్ వాడకుండా అరటి ఆకులు లేదా శుభ్రమైన కాటన్ వస్త్రాలను ఉపయోగించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.
పిల్లల భవిష్యత్తు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి తల్లిదండ్రి చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయాలని నిపుణులు కోరుతున్నారు.
~ సురేష్ సుంచు
