కొమరం భీమ్ – అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ ఘనంగా
ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, రాముడుగూడెంలో కొమరం భీమ్ – అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ
📍 పోలవరం / టి. నరసాపురం మండలం
📅 09-06-2026 | మంగళవారం | DNN NEWS
ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం ఏపిగుంట పంచాయతీ పరిధిలోని రాముడుగూడెం గ్రామంలో ఆదివాసి గిరిజన వీరుడు కొమరం భీమ్ మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బొరగం శ్రీనివాసులు హాజరై విగ్రహాలను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ, ఆదివాసీల ఆత్మగౌరవం, జల్-జంగిల్-జమీన్ (నీరు-అడవి-భూమి) హక్కుల కోసం పోరాడిన మహనీయుడు కొమరం భీమ్ అని కొనియాడారు. అలాగే అణగారిన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శకుడిగా నిలిచి దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని పేర్కొన్నారు.
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, విశిష్ట కళలు మరియు వారి వీరోచిత చరిత్రను నేటి తరాలకు పరిచయం చేసేలా ఈ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఆదివాసి గిరిజన సంఘం ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, పూసం అంజిబాబు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజన సోదరులు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS ప్రతినిధి
📍 పోలవరం
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
