స్టీల్ ప్లాంట్ ప్రమాదం పీడకల.. మృతుల కుటుంబాల బాధ వర్ణనాతీతం
బొకారో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ
📍 విశాఖపట్నం | జూన్ 09, 2026 | మంగళవారం | DNN NEWS
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం కార్మికులపై పడటంతో 8 మంది మృతి చెందగా, మరో 6 మంది తీవ్రంగా గాయపడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
విశాఖపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌కు ప్రతీక అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇటువంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు.
ప్రమాద ఘటనపై బొకారో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ చేపట్టినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన కార్మికులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలను ఓదార్చిన లోకేష్, శ్రీనివాస్ వర్మ
ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖకు చేరుకుని, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి కింగ్ జార్జ్ హాస్పిటల్లో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబ సభ్యులకు స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారి పిల్లల విద్య బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.
అనంతరం సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లి గాయపడిన కార్మికులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ భరత్, పల్లా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చీ తదితరులు పాల్గొన్నారు.
న్యాయమైన నష్టపరిహారం అందించాలి: వామపక్ష నేతలు
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయమైన నష్టపరిహారం అందించాలని సీపీఎం, సీపీఐ నాయకులు కేంద్ర మంత్రిని కోరారు.
సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీపీఐ నేత సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత ప్రమాదాల్లో ఇచ్చిన పరిహారాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత మెరుగైన ఆర్థిక సహాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, గతంలో జరిగిన ప్రమాదాల్లో అందించిన సహాయాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలకు మెరుగైన ఎక్స్‌గ్రేషియా అందించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
🖋️ DNN NEWS ప్రతినిధి
📍 విశాఖపట్నం
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
