క్షయ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్
టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కళ్ళెడ పీహెచ్సీలో వైద్య శిబిరం, అవగాహన కార్యక్రమం
📍 జగిత్యాల | జూన్ 10, 2026 | బుధవారం | DNN NEWS
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా కళ్ళెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి (డిప్యూటీ డీఎంహెచ్ఓ) డాక్టర్ ఎన్. శ్రీనివాస్ హాజరై క్షయ వ్యాధి నివారణ, చికిత్స మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రెండు వారాలకు మించి దగ్గు రావడం, రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం, బరువు తగ్గడం, కఫంలో రక్తం పడటం, ఛాతీలో నొప్పి లేదా బిగుతుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి పూర్తి స్థాయిలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పరీక్షలు, మందులను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
అలాగే క్షయ వ్యాధి పట్ల అపోహలు విడిచిపెట్టి, బాధితులకు సహకరించాలని, సమాజంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు ఇతర ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్.
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
