అక్రమ షెడ్ల తొలగింపులో మున్సిపల్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌కు బీజేపీ వినతిపత్రం
📍 జగిత్యాల | జూన్ 12, 2026 | శుక్రవారం | DNN NEWS
జగిత్యాల పట్టణంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను తక్షణమే తొలగించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు, అలాగే పాత బస్టాండ్ నుంచి గొల్లపల్లి రోడ్డు వరకు ప్రధాన రహదారుల ఇరువైపులా అక్రమ షెడ్లు, ఆక్రమణలు పెరిగిపోయాయని తెలిపారు.
వ్యాపారస్తులు తమకు కేటాయించిన స్థలాల కంటే ముందుకు వచ్చి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అక్రమ ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా అధికమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం మున్సిపల్ సిబ్బంది యావర్ రోడ్డులో కేవలం కొన్ని దుకాణాల షెడ్లను మాత్రమే తొలగించి, మిగతా ఆక్రమణలను అలాగే వదిలివేయడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందన్నారు.
మున్సిపల్ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించి, రాజకీయ లేదా వ్యక్తిగత ఒత్తిళ్లకు లొంగకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు.
పట్టణ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఒకవేళ మున్సిపల్ యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తే, పట్టణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు మిమ్మల నాగరాజు, సిరిపురం శ్రీలత శ్రీనివాస్, గట్టుపల్లి మానస జ్ఞానేశ్వర్, పట్టణ ఉపాధ్యక్షులు ఇట్యాల రాము, గ్యాదాసు రాజేందర్, పవన్ సింగ్, కొప్పు భాస్కర్, కార్యదర్శులు మేడిపల్లి పుష్ప రెడ్డి, కాశెట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక :::
