యావర్ రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం
జగిత్యాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ విజ్ఞప్తి
📍 జగిత్యాల | జూన్ 12, 2026 | శుక్రవారం | DNN NEWS
జగిత్యాల పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యావర్ రోడ్డు విస్తరణ, రోడ్డు ఆక్రమణల తొలగింపు, సమీకృత మార్కెట్ నిర్వహణతో పాటు పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డు విస్తరణ పనులను చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మిషన్ కాంపౌండ్ నుండి కొత్త బస్టాండ్ సమీపంలోని మంచాల కృష్ణ పెట్రోల్ బంక్ వరకు రోడ్డు విస్తరణకు అవసరమైన భూ యాజమాన్య పత్రాలను పరిశీలించి ఫైల్ సిద్ధం చేయాలని కోరారు.
అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లను ఆక్రమించి శాశ్వత షెడ్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఆక్రమణలను తొలగించి, తోపుడు బండ్ల వ్యాపారులకు మాత్రమే అవకాశాలు కల్పించాలని సూచించారు.
జగిత్యాల బీట్ చౌరస్తాలో నిర్మించిన సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి, మటన్, చికెన్, చేపలు, పూలు, పండ్లు, కూరగాయల విక్రయాలు సక్రమంగా జరిగేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ అఖిల్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
🖋️ DNN NEWS రిపోర్టర్ మొహమ్మద్ సల్మాన్
📍 జగిత్యాల జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక :::
