నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పడవ రేవుపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్వో, ఎంపీడీవోలకు కొక్కెరపాటి రవీంద్ర ఫిర్యాదు
📍 వేలేరుపాడు | జూన్ 12, 2026 | శుక్రవారం | DNN NEWS
కూనవరం – రుద్రంకోట గ్రామపంచాయతీల మధ్య ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో వేలంపాట ద్వారా నిర్వహిస్తున్న పడవ రేవులో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, సంబంధిత వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కొక్కెరపాటి రవీంద్ర వేలేరుపాడు ఎమ్మార్వో, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 10న నిర్వహించిన పడవ రేవు వేలంపాట సందర్భంగా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే వేలం రద్దు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు.
అయితే వేలంపాట నిర్వహించిన నాటి నుండి ఇప్పటి వరకు అధిక ఛార్జీలు వసూలు చేయడం, సరైన లైసెన్సులు లేని పడవలను నడపడం, పడవ డ్రైవర్లకు అవసరమైన అర్హత పత్రాలు లేకపోవడం వంటి అంశాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
ప్రయాణికుల భద్రతను పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా పడవలను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
🖋️ DNN NEWS ప్రతినిధి S. శ్యామల.
📍 వేలేరుపాడు | ఏలూరు జిల్లా
🌐 DNN NEWS – ప్రజల గొంతుక
