ఏలూరు జిల్లా ప్రతినిధి – కిరణ్ కుమార్ పాలూరి (DNN న్యూస్):
ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలోని కొండిజర్ల గ్రామంలో పోలీసులు వినూత్నంగా “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి సీఐ క్రాంతి కుమార్, ధర్మాజీగూడెం ఎస్సై, కే వెంకన్న పాల్గొన్నారు.
గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాత్రి సమయంలో సమావేశం ఏర్పాటు చేసి, మహిళలకు ప్రత్యేకంగా చట్టపరమైన హక్కులు, భద్రతా చర్యలపై వివరించారు. పోలీసులను చూసి భయపడకుండా, అవసరమైనప్పుడు నేరుగా సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మహిళలతో వివిధ ఆటలు నిర్వహించి, వారితో ఉత్సాహాన్ని పెంపొందించారు. పోలీసులతో కలిసి ఆటలు ఆడిన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో తరచూ నిర్వహించాలని కోరారు.
పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా “ఫ్రెండ్లీ పోలీసింగ్”ను ప్రోత్సహిస్తూ, గ్రామంలో విశ్వాసాన్ని పెంచే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడిందని అధికారులు తెలిపారు.
