– 70 లక్షలు ప్రజాధనం మంజూరు.. పనులు మాత్రం నత్తనడకన
– పేద ముస్లిం కుటుంబాలకు అందుబాటులోకి తేవాలని ఆర్డీవోకు మహమ్మద్ ఆరిఫ్ వినతి
కోరుట్ల, మే 18
కోరుట్ల పట్టణంలోని సర్వార్నగర్లో నిర్మాణంలో ఉన్న షాదీఖానా (వివాహ కమ్యూనిటీ భవనం) పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సామాజిక కార్యకర్త, ఆర్టీఐ కార్యకర్త మహమ్మద్ ఆరిఫ్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కు వినతిపత్రం సమర్పించారు. 70 లక్షల ప్రజాధనం మంజూరు అయినప్పటికీ షాదీఖానా నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ, కోరుట్ల పట్టణంలో నివసించే పేద మరియు మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు వివాహాలు, మతపరమైన కార్యక్రమాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ప్రత్యేకంగా షాదీఖానా నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. కానీ పనులు ప్రారంభమై చాలా కాలం గడిచినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం విచారకరమని అన్నారు.
ప్రస్తుతం పేద కుటుంబాలు ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో వివాహాలు నిర్వహించేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఒక్క వివాహ కార్యక్రమానికి కనీసం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వ్యయం అవుతుండటంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. షాదీఖానా పూర్తయితే అలాంటి కుటుంబాలకు ఎంతో ఊరట లభిస్తుందని అన్నారు.ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి, పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను వేగవంతం చేసి షాదీఖానాను త్వరితగతిన పూర్తి చేయాలని మహమ్మద్ ఆరిఫ్ ఆర్డీవోను కోరారు. ప్రజలకు ఉపయోగపడే షాదిఖాన భవనం సంవత్సరాల పాటు అసంపూర్తిగా ఉండకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అలాగే పట్టణ ప్రజలు కూడా షాదీఖానా పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
రిపోర్టర్ రియాజ్
