కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి – సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్
DNN / NEWS DESK – ఏలూరు
ఏలూరు, మే 15:
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా వినూత్న రీతిలో ధర్నా నిర్వహించారు. ఆటోను లాగుతూ నిరసన తెలుపుతూ “పెరిగే ధరలకు హద్దే లేదా?”, “ప్రజలపై భారాలు అరికట్టాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమానికి సీపీఎం నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్. లింగరాజు మాట్లాడుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై నిరంతరం భారాలు మోపుతూ, కార్పొరేట్ సంస్థలకు ప్రజల సంపదను దోచిపెడుతోందని విమర్శించారు.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో ఆయిల్ ధరలు తగ్గించకుండా, యుద్ధ పరిస్థితులను సాకుగా చూపిస్తూ ఆయిల్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.
ఆయిల్ ధరల పెరుగుదలతో అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజలపై మరింత భారం పడుతుందని తెలిపారు. కరోనా అనంతరం ప్రజలు ఇంకా ఆర్థికంగా కోలుకోలేక ఇబ్బందులు పడుతుండగా ఈ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచుతుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ధరల పెంపుదలను వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.ఎన్.వి.డి ప్రసాద్, కె. శ్రీనివాస్, నాయకులు మంచర్ల ఇస్సాకు, వి.వి.ఎన్ ప్రసాద్, గనిగంటి కోటేశ్వరరావు, వై. నాగేంద్ర, బల్ల వీరభద్రం, యిజ్జాడ దుర్గారావు, ఎస్. సత్యనారాయణ, జి. ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
– పంపన రవికుమార్ సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి
DNN / NEWS DESK – ఏలూరు
