ఘనంగా ముగిసిన ఏలూరు జిల్లా స్థాయి అండర్-13 చదరంగ పోటీలు
చెస్ డెవలప్మెంట్ అండ్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని త్రివేణి స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-13 ఓపెన్ & గర్ల్స్ చదరంగ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి. ఈ పోటీల ద్వారా ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 23, 24 తేదీలలో మార్కాపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్-13 ఛాంపియన్‌షిప్‌లో ఏలూరు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, చెస్ మేధో వికాసానికి గొప్ప సాధనమని పేర్కొన్నారు. చెస్ ఆడే విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. చెస్ క్రీడాకారులు సమాజంలో ప్రత్యేక వ్యక్తులుగా ఎదుగుతారని అన్నారు.
పోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి: బాలుర విభాగం
మల్లంపల్లి కుశాంక్ — మొదటి స్థానం
ఉప్పల ముదిత్ శ్రీ గుప్త — రెండవ స్థానం
బాలికల విభాగం
యడ్ల ప్రేమి రక్షిత — మొదటి స్థానం
మద్దూరి లక్ష్మీ హరిణి — రెండవ స్థానం
ఈ ఫలితాలను టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ పాలూరి కిరణ్ కుమార్ తెలిపారు.
అంతేకాకుండా, ఈ నెల 23వ తేదీ శనివారం ఏలూరులోని సెంట్ థెరీసా కాలేజ్ ఆఫ్ ఉమెన్‌లో నిర్వహించనున్న VIT ఏపీ అమరావతి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ సెలక్షన్స్ కూడా జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రెండు ఫార్మాట్లలో నిర్వహించనున్న ఈ టోర్నమెంట్ కొత్తగా చెస్‌లో రాణించాలని ఆశిస్తున్న క్రీడాకారులకు సువర్ణావకాశమని, చెస్ ప్రేమికులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకురాలు ఎస్. శ్యామల పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో త్రివేణి స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ ప్రసాద్, ఏలూరు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పాలూరి కిరణ్ కుమార్, కార్యదర్శి శ్రీ కన్నా సూర్య నాగేశ్వరరావు, కోచ్ మహేష్, స్కూల్ ప్రతినిధులు, క్రీడాకారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
